Mon Dec 22 2025 04:33:30 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. నిన్నటి వరకూ భక్తుల రద్దీతో కిటకిటలాడిన తిరుమల నేడు భక్తులు తగ్గిపోవడంతో స్వామి వారి దర్శనం సులువుగా మారింది. చాలా తక్కువ సమయంలోనే స్వామి వారిని భక్తులు దర్శంచుకుంటున్నారు. గంటల సేపు కంపార్ట్ మెంట్లలో వేచి చూడకుండానే భక్తులు ఏడుకొండల వాడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. వసతి గృహాలు కూడా వెంటనే దొరుకుతున్నాయి. తిరుమలలో పెద్దగా రద్దీ లేకపోవడంతో లడ్డూ విక్రయ కేంద్రం, అన్న ప్రసాదం కౌంటర్ వద్ద కూడా భక్తులు తక్కువ సంఖ్యలో ఉన్నారు.
మంత్రులు తిరుమలలో సమీక్ష...
నేడు వైకుంఠ ద్వార దర్శనాలపై మంత్రులు తిరుమలలో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానుండటంతో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, వంగలపూడి అనిత టీటీడీ పాలకవర్గం అధికారులతో సమావేశమవుతారు. ఈనెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. ఇప్పటికే ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టిక్కట్లను కేటాయించారు. గత ఏడాది జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని నేడు మంత్రులు తిరుమలలో సమీక్ష నిర్వహించనున్నారు.
ఏడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,903 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,612 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.64 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

