Thu Dec 11 2025 04:57:21 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. కొండ దాదాపు భక్తులతో నిండిపోయింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మాడ వీధులన్నీ గోవింద నామస్మరణాలతో మారుమోగిపోతుంది. అలాగే ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఘాట్ రోడ్డులో ప్రయాణం జాగ్రత్తగా చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
గత కొద్ది రోజుల నుంచి...
తిరుమలకు భక్తుల సంఖ్య ఎక్కువ మంది రావడం ఇప్పటి నుంచి కాదు. ఈ ఏడాది మే 15వ తేదీ నుంచి ప్రారంభమయింది. భక్తులు రాకతో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఇక తిరుమలకు వచ్చే భక్తులు అనేక మార్గాల్లో చేరుకుంటున్నారు. దర్శనానికి కూడా మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనంతో పాటు రోజువారీ ఎస్.ఎస్.డి. టోకెన్లు జారీ చేస్తుండటంతో వాటిని తీసుకుని క్యూ లైన్ లోకి వస్తున్నారు. ఇక కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా ఇటీవల బాగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై ఒక్క కంపార్ట్ మెంట్లలో
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,165 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,087మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారుల తెలిపారు.
Next Story

