Wed Mar 25 2026 10:31:58 GMT+0530 (India Standard Time)
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో తెలిస్తే?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినప్పటికీ భక్తుల రద్దీ తగ్గలేదు. వేసవి మొదలవుతుందని, ప్రస్తుతం చల్లటి వాతావరణం ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గత పదిహేను రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని అధికారుల తెలిపారు.
వేసవి రద్దీని తట్టుకునేలా...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో తిరుమలలోని మాడ వీధులన్నీ భక్తులతో కళకళలాడిపోతున్నాయి. గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. అయితే వేసవి రద్దీని తట్టుకునేందుకు ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామని, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన వారికి శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,381 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,451 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.46 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

