Tue Mar 24 2026 10:04:43 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో పెరిగిన రద్దీ.. భారీగా సమకూరిన ఆదాయం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. గత రెండు వారాలుగా తిరుమలలో నిత్యం భక్తులతో కళకళలాడుతుంది. నిత్యం మాడ వీధుల నుంచి తిరుమలలోని అన్ని వీధులు గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
వివిధ మార్గాల్లో...
తిరుమలకు వచ్చే భక్తులు వివిధ మార్గాల్లో చేరుకుంటుంటారు. ఎప్పటికప్పుడు నెలవారీ టోకెన్లు ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేస్తుంది. అదే సమయంలో కాలినడకన వచ్చి తమ మొక్కులు చెల్లించే భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. తిరుపతిలో ప్రతి రోజూ ఎస్.ఎస్.డి. టోకెన్లను తీసుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఇక సర్వదర్శనం క్యూ లైన్ లోకి వచ్చి ఒక్కసారి లైన్ లోకి వెళితే దర్శనమవుతుందని భావించి గంటల తరబడి వేచి చూసే వారు కూడా అనేక మంది ఉంటారు.
కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. అంటే కిలోమీటర్ కు పైగానే భక్తులు బయట వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,483 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,777 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.12 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

