Mon Mar 16 2026 11:36:03 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు వచ్చే భక్తులు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. గత వారం రోజుల నుంచి తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. శుక్రవారం మొదలయిన భక్తుల రద్దీ సోమవారం వరకూ కొనసాగడం గత కొన్ని రోజులుగా కనపడుతుంది. అందుకే నేడు కూడా తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. కిలో మీటర్ల మేరకు భక్తుల క్యూ లైన్ విస్తరించిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
టోకెన్ల జారీలో...
తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనం టోకెన్ల విషయంలో ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. తిరుపతిలో టోకెన్లు పంపిణీ చేస్తుంది. రేపటి టైమ్ స్లాట్ దర్శనానికి సంబంధించి నేడు తిరుపతిలో టోకెన్లను పంపిణీ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఎస్ఎస్డీ టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,057 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,990 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.22 కోట్లు వచ్చిందని అధికారలు తెలిపారు.
Next Story

