Sun Mar 15 2026 10:17:44 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు వెళ్లే వారు గంటల తరబడి నిరీక్షించాల్సిందే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. గత రెండు రోజుల నుంచి అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం కావడంతో పాటు వేసవి రద్దీ మరింత పెరుగుతుందని భావించిన చాలా మంది శ్రీవారి చెంతకు వచ్చి తిరుమలలో మొక్కులు తీర్చుకునేందుకు తరలి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పరీక్షల సీజన్ అయినా...
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక పదో తరగతి పరీక్షలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే వీటి ఫలితాలు వచ్చిన తర్వాత భక్తుల రద్దీ మరింతగా పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకున్న వారు కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదని తరలి వస్తున్నారు. దీంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు కిలోమీటర్ల క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలను శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు ఈరోజు దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 85,132 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 38,855 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.62 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

