Mon Jan 19 2026 16:52:28 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు హై అలెర్ట్
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. ఆదివారం కావడంతో సహజంగానే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే వరసగా సంక్రాంతి సెలవులు రావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తిరుమలకు అలిపిరి టోల్ గేట్ నుంచి భక్తుల రద్దీ కనిపిస్తుంది. వాహనాల తనిఖీ సమయంలోనే ఎక్కువ టైమ్ పడుతుంది. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరి ఉన్నాయి. ఈరోజు స్వామి వారిని దర్శించుకుని తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లి విధుల్లో చేరేందుకు చాలా మంది ప్లాన్ చేసుకున్నారు.
ఇటీవల కాలంలో...
తిరుమలకు భక్తుల రద్దీ ఇటీవల కాలంలో ఎక్కువగా కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం వేసవి సెలవులు మాత్రమే కాదు.. శుక్రవారం నుంచి ప్రారంభమైన రద్దీ ఆదివారం వరకూ కొనసాగుతుంది. శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకు నాలుగు కోట్ల రూపాయలకు పైగానే హుండీ ఆదాయం లభిస్తుంది. కంపార్ట్ మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ లోవేచి ఉంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
శిలాతోరణం వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 83,576 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,173 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.07 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

