Sun Dec 21 2025 06:01:28 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు ఆదివారం భక్తుల రద్దీ ఎలా ఉందో తెలిస్తే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా శుక్రవారం నుంచి రద్దీ మొదలయి సోమవారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. స్వామి వారి హుండీ ఆదాయం కూడా గతంలో కంటే గణనీయంగా పెరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు. అదే సమయంలో శ్రీవారి సేవకుల సేవలను ఉపయోగించుకుని భక్తులకు సౌకర్యాలను అందించడంలో అండగా ఉంటున్నారు.
ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో...
మరొకవైపు ఈ నెల 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంది. ధనుర్మాసం కావడంతో ఈ రోజుల్లో వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే మంచిదని అందరూ భావిస్తారు. ధనుర్మాసం లో విష్ణుమూర్తిని ఎక్కువగా కొలిచే సంప్రదాయం ఉంది. అందుకే ధనుర్మాసంలో ఎక్కువ మంది తిరుమలను దర్శించుకుని కలియుగ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటూ ఉంటారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈ నెలాఖరు నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కూడా ప్రారంభమవుతుందని అందుకు తగిన ఏర్పట్లు చేస్తున్నారు.
పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 78,466 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో : 29,722 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.52కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

