Tue Dec 16 2025 09:14:23 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి అలెర్ట్...ఎంత సమయం వేచి చూడాలంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. మంగళవారమయినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ తగ్గలేదు. గంటల తరబడి స్వామి వారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. గత కొన్ని రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ధనుర్మాసం ప్రారంభం కావడంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభప్రదమని నమ్మి ఈ నెల రోజులు తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
నేడు పాలకమండలి సమావేశం...
నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశం లో ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లపై పాలక మండలి చర్చించనుంది. ఈ నెల 30వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. లక్షల మంది భక్తులు తరలి రానున్నారు. దీంతో భక్తులకు అవసరమైన వసతి సౌకర్యంతో పాటు అన్న ప్రసాదం, మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు వచ్చిన సామాన్య భక్తులందరికీ దర్శనం లభించేలా చర్యలు తీసుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఈరోజు చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
31 కంపార్ట్ మెంట్లలో ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,251 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,862 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.66 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

