Fri Feb 20 2026 13:42:10 GMT+0530 (India Standard Time)
Tirumala : కిటకిటలాడుతున్న తిరుమల కొండ.. దర్శనానికి ఎంత సేపు వెయిట్ చేయాలంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. శుక్రవారం కావడంతో ముందుగా అంచనా వేసినట్లుగానే తిరుమలకు భక్తుులు పోటెత్తారు. గత రెండు మూడు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మాత్రం శుక్రవారం నుంచి భక్తుల రద్దీ పెరుగుతుందని అంచనా వేసి అందుకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేశారు. చర్యలు తీసుకుంటున్నారు. ఊహించిన విధంగానే శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువయింది.
పుష్కరిణికి నో అనుమతి...
తిరుమలలో రద్దీ తెలియాలంటే కింద అలిపిరి టోల్ గేట్ వద్దే మనకు కనపడుతుంది. అత్యధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి.. తనిఖీ కోసం ఎక్కువ సమయం పడుతుందంటే కొండ మీద కూడా రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించవచ్చు. నేటి నుంచి మార్చి ఐదో తేదీ వరకూ శ్రీవారి పుష్కరిణిలోకి భక్తులను అనుమతిని నిలిపేవేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకూ వార్షిక తెప్పోత్సవం కారణంగా తిరుమల తిరుపతిదేవస్థానం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్కీడిప్ లో మే నెల ఆర్జిత సేవా టిక్కెట్లను కేటాంచనున్నారు. ఉదయం పది గంటల వరకూ భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశముంది.
అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండి...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అవసరమైన మజ్జిగ, మంచినీరు, పాలు, అన్న ప్రసాదాలను శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది నుంచి పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతిదేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 57,682 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,020 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

