Thu Jan 15 2026 04:40:15 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలకు వచ్చే భక్తులకు హై అలెర్ట్.. దర్శనం కావాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి వరకూ కొద్దిగా తగ్గినట్లు కనిపించినప్పటికీ నేడు తిరుమలకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి నాడు స్వామి వారిని దర్శించుకోవాలని భక్తులు బారులు తీరారు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. అయితే సంక్రాంతికి ముందు కొంత భక్తుల రద్దీ తగ్గినట్లు కనిపించినప్పటికీ నేడు మాత్రం తిరిగి రద్దీ ప్రారంభమయింది. భక్తుల అధిక సంఖ్యలో రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
సెలవులు కావడంతో...
తిరుమలకు ఏ సెలవులు వచ్చినా సరే ఇప్పుడు రద్దీగా ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. గతంలో వేసవి సెలవుల్లోనే భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించేది. కానీ నేడు అలా కాదు. ఏ మాత్రం పండగ సెలవులు కానీ, మరేదైనా సెలవులు వస్తాయని తెలిసినా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అలిపిరి టోల్ గేట్ నుంచి రష్ ను గమనించి అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారికి అన్న ప్రసాదాలు, మజ్జిగను పంపిణీ చేస్తున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. అంటే దాదాపు కిలోమీటర్లకు పైగానే భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పథ్నాలుగు నుంచి పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 76,289 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,586 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.84 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

