Wed Jan 07 2026 17:25:31 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే ఇది మీకోసమే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమలలో ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మందికి వైకుంఠ ద్వార దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కల్పించారు. రోజుకు ఎనభై వేల మందికిపైగానే వైకుంఠ ద్వార దర్శనం నుంచి ఏడుకొండల వాడిని దర్శించుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.
నేడు స్థానికులకు అవకాశం...
నేడు వైకుంఠ ద్వార దర్శనానికి స్థానికులను అనుమతిస్తున్నారు. ఆధార్ కార్డు చూపించి స్వామి వారిని దర్శించుకునేందుకు వీలు కల్పిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నెలలో మామూలుగా ఒక మంగళవారం మాత్రం స్థానికులకు దర్శనం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో నేడు స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం కూడా గత ఎనిమిది రోజుల నుంచి భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు.
ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యాకాంప్లెక్స్ లోని ముప్ఫయి ఒక్క కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పదమూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 82,650 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,331 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.08 కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story

