Sun Apr 12 2026 10:24:47 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో ఒక్కసారిగా భక్తుల రద్దీ ఎక్కువయింది. నిన్నటి వరకూ భక్తుల సంఖ్య సాధారణంగానే ఉన్నప్పటికీ తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఆదివారం ఒక్కసారిగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. క్యూ లైన్ లో ఉన్న వారి కోసం శ్రీవారి సేవకులు మంచి నీరు, అన్న ప్రసాదాలను అందిస్తున్నారు. అలాగే ఎండ వేడిమికి తట్టుకునేలా మాడ వీధుల్లో గచ్చుపై కూల్ పెయింట్ వేశారు. శ్రీవారి సేవకులు అనేక బృందాలుగా విడిపోయి మంచినీరు భక్తులకు అందిస్తున్నారు.
ఈ ఏడాది రికార్డు బ్రేక్...
తిరుమలకు 2025-26లో రికార్డుస్థాయిలో తిరుమల శ్రీవారిదర్శనాలు జరిగాయి. 2023-24, 2024-25లో..రోజుకు 70వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 2025-26లో రోజుకు 73 వేలకు చేరిన భక్తుల సంఖ్యచేరుకుంది. గతంతో పోలిస్తే 4.57శాతం వృద్ధి నమోదయింది. 6 నెలలపాటు ప్రతినెలా రూ.120కోట్లకుపైగా హుండీ ఆదాయం లభించిందని, తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాల్లో 12.6శాతం వృద్ధి సాధించినట్లు అధికారులు తెలిపారు.
ఇరవై ఏడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,288 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,892 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.43 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

