Tue Dec 09 2025 04:53:18 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారికి అలెర్ట్... దర్శనం కోసం?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ కొద్దిగా పెరిగింది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ కొద్దిగా పెరిగింది. నిన్న భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో సులువుగా స్వామి వారిని దర్శించుకున్న భక్తులు నేడు మాత్రం కొంత రద్దీ పెరగడంతో స్వామి వారి దర్శనం కోసం కంపార్ట్ మెంట్లలో కొద్దిసేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో మంచుతో పాటు చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. రేపటి నుంచి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
రద్దీ ఎక్కువగానే...
తిరుమలలో నేడు వసతి గృహాల కోసం కూడా కొన్ని గంటల సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే లడ్డూ ప్రసాదాల కౌంటర్, అన్న ప్రసాదం వితరణ కేంద్రం వద్ద కూడా భక్తులు అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల ఖచ్చితంగా బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తుంది. అలాగే వరాహస్వామిని కూడా ముందుగా దర్శించుకున్న తర్వాత మాత్రమే వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. దీంతో ఈ రెండు ఆలయాల వద్ద కూడా భారీగా భక్తులున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పదిహేను కంపార్ట్ మెంట్లలో ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదిహేను కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు శ్రీవారి దర్శనం కోసం చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో కి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 71,142 మంది భక్తుల దర్శించుకున్నారు. వీరిలో 26,619 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.13 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

