Sun Dec 07 2025 05:58:09 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులూ.. ఆదివారం కొండకు వస్తున్నారా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. గత మూడు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రాను రాను పెరుగుతుంది. గతంలో కేవలం సెలవు దినాలు, వేసవి సీజన్ లో మాత్రమే భక్తుల రాకతో తిరుమల రద్దీగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి రోజూ రద్దీగా ఉంటంతో క్యూ లైన్ల ఏర్పాటు విషయంలో కూడా టీటీడీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గంటల సేపు వేచి ఉన్నా...
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లలో గంటల తరబడి వేచి ఉన్నా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఇబ్బందులు పడటం లేదు. ప్రస్తుతం తిరుమలలో వసతి గృహాలు దొరకడానికి కూడా సమయం పడుతుంది. అదే సమయంలో కంపార్ట్ మెంట్లలో భక్తులు గంటల కొద్దీ వేచి ఉన్నప్పటికీ స్వామి వారిని చూసిన వెంటనే తాము పడిన కష్టాన్ని మాత్రం మర్చిపోతారు. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు ఇటు ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు వెంకటేశ్వరుడిని దర్శించుకోవడాన్ని ఇష్టంగానే ప్రతి భక్తుడూ చూస్తాడు కాబట్టి ఎంత మంది వచ్చినా భక్తులను ప్రవేశం కల్పిస్తారు.
ఇరవై కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు నుంచి పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,007 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39,154 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.13 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

