Tue Feb 03 2026 04:43:58 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. వెంటనే దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గత కొన్ని రోజులతో పోల్చుకుంటే ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం కావడంతో పాటు సెలవులు అన్నీ ముగియడంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య కొంత తక్కువగా ఉంది. అయితే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదని, రోజుకు దాదాపు నాలుగు కోట్ల రూపాయల వరకూ తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం వస్తుందని, భక్తులు తగ్గినా ఆదాయం తగ్గలేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఎప్పటికప్పుడు...
తిరుమలకు వచ్చే భక్తులు సంఖ్య ఎక్కువ అవుతుండటంతో సర్వదర్శనాల విషయంలోనూ టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే శ్రీవాణి టిక్కెట్లను కూడా ఇటీవల కాలంలో ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు. ముందుగా ప్రత్యేక దర్శనం కోసం ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులతో పాటు అప్పటికప్పుడు మొక్కులు చెల్లించుకునే వారు తిరుమలకు చేరుకుంటున్నారు. వసతి గృహాలు కూడా కొద్దిగా వెంటనే లభిస్తున్నాయి. తిరిగి శుక్రవారం నుంచి భక్తుల రద్దీ మొదలవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
పదకొండు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదకొండు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు ఈరోజు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,262 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన వారు 22,728 గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు వచ్చింది.
Next Story

