Thu Mar 26 2026 10:10:42 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలకు నేడు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. శ్రీవారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గత కొన్ని రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంత భక్తుల రద్దీ తక్కువగానే కనిపిస్తుంది. గత పదిహేను రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరిగి రేపటి నుంచి రద్దీ మొదలవుతుందని చెబుతున్నారు.
భక్తులు ఇబ్బందులు పడకుండా...
తిరుమలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రద్దీ తగ్గడంతో స్థానికులు ఎక్కువగా నేడు తిరుమలకు వచ్చే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి. రేపు శ్రీరామనవమి కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ, భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్ఫయి కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటలు పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,411 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,474 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.43 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

