Wed Feb 25 2026 10:12:54 GMT+0530 (India Standard Time)
Tirumala : తిరుమలలో తగ్గని రద్దీ.. అసలు రీజన్ ఇదే
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. గత శుక్రవారం నుంచి మొదలయిన భక్తుల రద్దీ బుధవారం వరకూ కొనసాగుతుంది. పరీక్షలు మొదలయినప్పటికీ అధికసంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఇక వేసవిలో రద్దీ మరింత పెరుగుతుందని భావించి ముందుగానే స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. స్వామి వారి హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
వేసవి కాలంలో...
వేసవికాలంలో రద్దీ మామూలుగా ఉండదు. రోజుకు ఎనభై నుంచి లక్ష మంది వరకూ భక్తులు తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ దాదాపు ఆగస్టు నెల వరకూ ఈ రద్దీ కొనసాగనుంది. అందుకే వేసవి రద్దీ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. వేసవి కాలంలో భక్తుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తారా? లేదా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే శుక్ర, శని, ఆదివారాలు వీఐపీ బ్రేక్ దర్శనాలకు కూడా పరిమితి విధించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై ఐదు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,902 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,869 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

