Mon Jan 19 2026 13:44:04 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత మూడు రోజుల నుంచి తిరుమలకు భక్తుల రాక ఎక్కువగా ఉంది. సంక్రాంతి సెలవులు కావడంతో అధిక శాతం మంది భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. సోమవారమయినా భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నిన్నటి వరకూ కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట శిలాతోరణం వరకూ క్యూ లైన్ విస్తరించి ఉండేది. కానీ నేడు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
వసతి గృహాలు కూడా...
ఆదివారం అమావాస్య కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సోమవారం కూడా అదే రద్దీ కొనసాగుతుంది. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకున్న వారు, కాలినడకన వచ్చే వారితో తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. వసతి గృహాలను పొందడానికి కొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే సంక్రాంతి సెలవులు కారణంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా ఎక్కువగా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
31 కంపార్ట్ మెంట్లలో....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టై్మ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 84,058 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,512 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు
Next Story

