Fri Dec 26 2025 05:12:07 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనం కావాలంటే రోజంతా క్యూ లైన్ లోనే?
వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టికెట్లు లేనివారికి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది. శిలా తోరణం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు.తిరుమలలో వసతి గృహాలు కూడా దొరకడం కష్టంగా మారింది. నిన్న 72వేల మంది భక్తులు వేంకన్నస్వామిని దర్శించుకున్నారు. హుండీకి రూ.4.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. కాగా డిసెంబర్ 28 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. తిరుమలకు వచ్చే భక్తులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని రావాలని కోరింది.
శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీ రద్దు ...
మూడు రోజుల పాటు శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీ రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29వ తేదీలకు సంబంధించి శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ లో, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేయరని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఇరవై నాలుగు గంటల దర్శనం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ బయట రెండు కిలోమీటర్ల మేర విస్తరించింది. శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం నేడు ఇరవై నాలుగు గంటల సమయం పడుతందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు మూడు గంటలకుపైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,355 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 37,154 మంది భక్తుల తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

