Wed Dec 10 2025 03:55:27 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎంత ఉందో తెలుసా?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది

తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం అయినప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. భక్తులు కంపార్ట్ మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శ్రీవారి దర్శనం గంటల సమయం పడుతుంది. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలను టీటీడీ అధికారులు తీసుకుంటున్నారు. వారికి అన్న ప్రసాదం, మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు.
టోకెన్ లు లేని వారికి కూడా...
శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలలో వైకుంఠ ద్వార దర్శనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. డిప్ సిస్టమ్ ద్వారా వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు పొందలేని శ్రీవారి భక్తులు జనవరి 2వ తేదీ నుంచి జనవరి 8 మధ్య ఏ రోజుననైనా సర్వ దర్శన క్యూ ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఎందరు వచ్చినా దర్శనానికి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఇరవై కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 70,901 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,128మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

