Sat Feb 21 2026 11:16:30 GMT+0530 (India Standard Time)
Tirumala : శనివారం ఎందుకు తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్నటి నుంచి పెరిగిన భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం అని భక్తులు విశ్విస్తారు. వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం కూడా.ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం.శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది కూడా శనివారమే. వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే అని చెబుతారు. అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరమని నమ్ముతారు కాబట్టి ఈరోజు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.
వేసవి రద్దీని తట్టుకునేందుకు...
త్వరలో ప్రారంభం కానున్న వేసవి సెలవులకు రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపడుతున్నారు. గత రెండు–మూడు సంవత్సరాల వేసవి డేటాను విశ్లేషించి, దర్శనాల సంఖ్య, వేచి ఉండే సమయం, తర్వాత రోజు దర్శనాలకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సంఖ్య వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు.భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యంలో షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్, అవసరమైన చోట్ల షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బయట వరకూ క్యూ లైన్...
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్తానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. వసతి గృహాల కోసం కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.46 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

