సికింద్రాబాద్ వ్యక్తికి ఆన్లైన్ ట్రేడింగ్ మోసం.. కోటి రూపాయలకు పైగా నష్టం
ఫేక్ ఐపీవో పెట్టుబడుల పేరుతో మోసం చేసిన దుండగులు వాట్సాప్ మెసేజ్‌తో వల వేసి రెండు నెలల్లో మొత్తం సొమ్ము గుంజారు

సికింద్రాబాద్, నవంబర్ 4 : ఆన్లైన్ ట్రేడింగ్,పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తిని కోటి రూపాయలకు పైగా మోసం చేసిన ఘటన సికింద్రాబాద్ లో వెలుగుచూసింది. సికింద్రాబాద్ సిక్స్ విలేజ్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి నాగేశ్వరరావు (54) ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఆగస్టు 2న ‘ప్రీమియర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లిమిటెడ్’ పేరుతో నికితా శర్మ అనే మహిళ వాట్సాప్ ద్వారా నాగేశ్వరరావును సంప్రదించింది. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి మొదట రూ.20 వేల పెట్టుబడి పెట్టించింది. తప్పుడు లాభాలు చూపి మరింత పెట్టుబడులు పెట్టించేందుకు ప్రేరేపించింది.
తర్వాత రాజ్ కొరాడియా అనే వ్యక్తి కూడా అదే సంస్థ ప్రతినిధిగా పరిచయం చేసుకుని “టెక్డీ”, “సాత్విక్” వంటి ఐపీవోలలో పెట్టుబడులు పెట్టమని ఒత్తిడి చేశాడు. ఆ విధంగా రెండు నెలల్లో నాగేశ్వరరావు ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, నగదు రూపంలో రూ.1.02 కోట్లు వివిధ బ్యాంకు ఖాతాలకు పంపించారు.
తర్వాత మోసగాళ్లు అకౌంట్ బ్లాక్ చేశారు. పన్నులు, హ్యాండ్లింగ్ ఫీజు పేరుతో మరిన్ని డబ్బులు అడిగారు. అక్టోబర్ 22న రూ.5 లక్షలు పంపిన తర్వాత వారంతా ఆఫ్‌లైన్ అయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి, ఫేక్ ట్రేడింగ్ ప్లాటుఫామ్లు, సంబంధిత బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు ప్రారంభించారు.

