Investment Scam: రూ.9.6 లక్షలు మోసం.. పెట్టుబడి పేరుతో మహిళకు టోపీ
యాప్ రుణాలు తీసుకుని పంపించిన బాధితురాలు డబ్బు అడిగితే స్పందించని ఇద్దరు వ్యక్తులు

మదన్నపేటకు చెందిన 33 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగిని పెట్టుబడులపై అధిక లాభాలు ఇస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు సుమారు రూ.9,60,000 మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. పూలతోట ప్రాంతానికి చెందిన ఆమె గత ఏడేళ్లుగా ప్రైవేట్ సంస్థ లో పనిచేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కస్టమర్ సర్వీస్ కాల్ ద్వారా హరిత్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2020లో అతని వద్ద నుంచి రూ.20,000 తీసుకుని వెంటనే తిరిగి చెల్లించింది. ఆ సమయంలో తనకు భూములు, వ్యాపారాలు ఉన్నాయని హరిత్ చెప్పినట్లు తెలిపింది. తరువాత అదే నంబర్‌కు కాల్ చేయగా కార్తిక్ రెడ్డి అని పరిచయం చేసుకున్న మరో వ్యక్తి మాట్లాడి, తాను హరిత్ బంధువు అని, వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్పినట్లు పేర్కొంది.
పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్పడంతో ఆమె వివిధ లోన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకుని వారికి పంపింది. మొదట కొంత డబ్బు తిరిగి ఇచ్చి రెండు మూడు ఈఎంఐలు చెల్లించడంతో నమ్మకం పెరిగింది.
తర్వాత వివిధ యాప్‌ల నుంచి తీసుకున్న మొత్తంగా రూ.9,60,000 పంపినట్లు బాధితురాలు తెలిపింది. ఫైబ్ నుంచి రూ.90,000, నవి నుంచి రూ.1,40,000, ఎర్లీ సాలరీ నుంచి రూ.90,000, క్రెడిట్ బీ నుంచి రూ.1,80,000, బజాజ్ ఫిన్‌కార్ప్ నుంచి తీసుకున్న రూ.4,82,225 రుణంలో నుంచి రూ.4,60,000 పంపినట్లు వెల్లడించింది.
నిందితులు ప్రత్యక్షంగా ఎప్పుడూ కలవలేదని, మొబైల్ ద్వారానే మాట్లాడినట్లు తెలిపింది. వేర్వేరు పేర్లు చెప్పినా ఒకే ఫోన్ నంబర్, రెండు బ్యాంకు ఖాతాలు వాడినట్లు ఆరోపించింది. డబ్బు తిరిగి ఇవ్వాలని, ఈఎంఐలు చెల్లించాలని కోరగా కాల్స్‌కు స్పందించకుండా తప్పించుకున్నారని పేర్కొంది. పెట్టుబడి పేరుతో మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

