టెలిగ్రామ్ ట్రేడింగ్ మోసం… కన్సల్టెంట్‌కు రూ.2.96 లక్షల నష్టం
‘లాస్ రికవరీ స్కీమ్’ పేరుతో రెండు గంటల్లో భారీ లాభాల హామీ కమిషన్, అకౌంట్ అన్‌లాక్ ఫీజుల పేరిట వరుసగా డబ్బులు వసూలు

"లాస్ రికవరీ" పేరు తో కన్సల్టెంట్ కు రూ.2.9 లక్షలు బురిడీ
టెలిగ్రామ్‌లో నకిలీ ట్రేడింగ్ గ్రూప్ మోసానికి హైదరాబాద్‌లో ఒక డేటా కన్సల్టెంట్ బలయ్యాడు. శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన కార్తిక్ పురోహిత్ (44) నుంచి మోసగాళ్లు మొత్తం రూ.2,96,031 దోచుకున్నట్టు పోలీసులు తెలిపారు.
నలగండ్లలో నివసించే పురోహిత్ మార్చి 11న చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టెలిగ్రామ్‌లో వచ్చిన ప్రకటన చూసి “బూమింగ్ బుల్స్ అకాడమీ” అనే గ్రూప్ లో చేరినట్టు చెప్పారు. ట్రేడింగ్ నేర్పుతామని, “లాస్ రికవరీ స్కీమ్”లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో లాభాలు వస్తాయని గ్రూప్ సభ్యులు ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రెండు గంటల్లో లాభాలు...
ఈ స్కీమ్ ప్రకారం రూ.50 వేల పెట్టుబడి పెడితే రెండు గంటల్లో రూ.2 లక్షలు వస్తాయని చెప్పారు. గ్రూప్ లో చేరిన తర్వాత దీపక్ అగర్వాల్ అనే వ్యక్తి టెలిగ్రామ్‌లో పురోహిత్‌ను సంప్రదించాడు. పెట్టుబడి పెట్టాలని చెప్పి యూపీఐ లింకులు, బ్యాంక్ ఖాతా వివరాలు పంపించాడు.
మొదట పురోహిత్ యూపీఐ ద్వారా రూ.50 వేలు పంపించాడు. కొద్ది గంటల తర్వాత పెట్టుబడిపై రూ.2,98,000 లాభం వచ్చిందని మోసగాళ్లు చెప్పారు. అయితే ఆ డబ్బు విడుదల కావాలంటే 30 శాతం కమిషన్ చెల్లించాలని కోరారు.
కమిషన్ పేరుతో
దీనిని నమ్మిన పురోహిత్ రూ.89,666 కమిషన్‌గా పంపించాడు. ఆ డబ్బులు రాలేదని,పంపిన మొత్తం సరిపోలలేదని చెప్పి మరోసారి కమిషన్ పంపాలని మోసగాళ్లు ఒత్తిడి చేశారు. దీంతో అతడు మళ్లీ రూ.89,665.50 చెల్లించాడు.
తర్వాత అకౌంట్ బ్లాక్ అయ్యిందని చెబుతూ అన్‌లాక్ చేయడానికి రూ.66,700 పంపాలని చెప్పారు. మొత్తం లాభంతో కలిపి వెంటనే తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
పురోహిత్ చేసిన లావాదేవీలు వివరాలు:
- ప్రారంభ పెట్టుబడి: రూ.50,000
- కమిషన్ చెల్లింపు: రూ.89,666
- రెండో కమిషన్: రూ.89,665.50
- అకౌంట్ అన్‌లాక్ ఫీజు: రూ.66,700
ఇలా మొత్తం రూ.2,96,031 పంపించినప్పటికీ ఎలాంటి డబ్బు తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు.
నకిలీ ట్రేడింగ్ యాప్
మోసగాళ్లు నకిలీ యాప్ తయారు చేసి, ఆ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన అనేక బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ చేయాలని చెప్పినట్టు పురోహిత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరుసటి రోజు “లేట్ ఫీజు” పేరుతో మరో చెల్లింపు కోరడంతో అనుమానం వచ్చి అతడు లావాదేవీలు ఆపేశాడు.
పురోహిత్ ఐసీఐసీఐ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంక్‌లకు సమాచారమిచ్చాడు. వారు సర్వీస్ రిక్వెస్టులు నమోదు చేసి, తదుపరి దర్యాప్తుకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సూచించారు.
ఈ కేసులో “బూమింగ్ బుల్స్ అకాడమీ” నిర్వాహకులతో పాటు టెలిగ్రామ్ హ్యాండిల్స్ BOOMING_BULLS_ACADAMYY, Boomingbulls66, అలాగే దీపక్ అగర్వాల్, అనీష్ సింగ్ ఠాకూర్ పేర్లు ఫిర్యాదులో ఉన్నాయి. లావాదేవీల్లో ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఐడీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

