crypto trading scam: హైదరాబాద్ టెకీకి ₹55.9 లక్షలు ఆన్లైన్ క్రిప్టో మోసం
మ్యాట్రిమోనీలో పరిచయం.. ఆపై మోసం

హైదరాబాద్: కేపీహెచ్‌బీ కి చెందిన టెకీ సైబర్ నేరగాళ్ల చేతిలో బలయ్యాడు. కాపు మాట్రిమోనీ ద్వారా సైబర్ క్రైమ్ కి సాఫ్ట్వేర్ ఉద్యోగి బలైన సంఘటన మరువక ముందే మరో మాట్రిమోనీ నుండి మోసపోయానంటూ బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే, కేపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న పవన్ నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా రూ.55.9 లక్షలు కోల్పోయారు.
ఫిర్యాదు ప్రకారం ఎం.రమేశ్ బాబు కుమారుడు, ఎం.పవన్ కుమార్ (35), జూలై 26, 2025న పద్మశాలి మ్యాట్రిమోనీ వెబ్సైట్లో (ID: PDM484032) శ్రీజా అనే మహిళ తో పరిచయం ఏర్పడింది. ఆగస్టు 10 నుంచి ఆమెతో వాట్సాప్ ద్వారా (+44 7721257056) మాట్లాడటం ప్రారంభించారు.
తప్పుడు సైట్ చూపించి పెట్టుబడి.....
ఒక వారం వ్యవధిలోనే ఆమె ‘bitcoin-ak.com’ అనే క్రిప్టో సైట్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పి, పెట్టుబడి పెట్టించింది. తాను మొదట ఆగస్టు 24న బైనాన్స్ ద్వారా 1,000 యూఎస్డీటీ (సుమారు రూ.1 లక్ష) కొనుగోలు చేసి ఆ ప్లాట్‌ఫారమ్‌కి బదిలీ చేశాడు. మరుసటి రోజు మరో రూ.50 వేలూ పంపాడు. మొదట 100 యూఎస్డీటీ లాభం చూపించి రూ.8,585 ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వడంతో నమ్మకం కలిగిందని చెప్పారు.
ఆ తర్వాత క్రమంగా వివిధ ఖాతాలకు మొత్తాలు పంపిస్తూ రూ.55.9 లక్షలు పెట్టుబడి పెట్టాడు. వీటిలో కొంత మొత్తాన్ని వ్యక్తిగత రుణాలు, బంగారం తాకట్టు పెట్టి , తన సోదరుడి ఖాతా ద్వారా తీస్కుని పంపినట్లు తెలిపారు.
‘పన్ను చెల్లిస్తేనే డబ్బు విడుదల’ అని మోసం
కొంతకాలం సైట్లో వర్చువల్‌గా రూ.1.90 కోట్లు లాభం చూపించారు. డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే రూ.22 లక్షలు ‘ట్యాక్స్’ పేరిట చెల్లించాలన్నారు. అనుమానం వచ్చిన పవన్ వెంటనే పోలీసులను సంప్రదించారు. తాను మొత్తం రూ.55.9 లక్షలు పంపి, తిరిగి కేవలం రూ.8,585 మాత్రమే పొందానని తెలిపారు.
సైబరాబాద్ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ bitcoin-ak.com నిర్వాహకులపై దర్యాప్తు ప్రారంభించారు

