Thu Dec 18 2025 09:55:03 GMT+0000 (Coordinated Universal Time)
Cyber Crime : క్రిస్మస్.. న్యూఇయర్.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకూడదంటే ఇలా చేయండి
ఈ నెల సైబర్ నేరగాళ్లకు అత్యంత కీలకం. మోసం చేయడానికి అనువైన రోజులివే

ఈ నెల సైబర్ నేరగాళ్లకు అత్యంత కీలకం. మోసం చేయడానికి అనువైన రోజులివే. ప్రధానంగా క్రిస్మస్ పండగతో పాటు న్యూ ఇయర్ సందర్భంగా మీ ఫోన్లలోకి సైబర్ నేరగాళ్లు దూసుకు వచ్చే అవకాశముంది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ ముసుగులో సైబర్ మోసాలు జరుగుతాయని తెలిపారు. రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ప్రజలు అదనపు జాగ్రత్తలు పాటించాలని హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు సూచించారు. పండుగల సమయంలో ఆన్లైన్ కార్యకలాపాలు పెరగడం, ఉత్సాహం ఎక్కువగా ఉండటంతో సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.
మోసాలు ఇలా...
క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ గిఫ్ట్, విదేశీ లాటరీ, క్యాష్‌బ్యాక్ వచ్చిందని సందేశాలు పంపుతూ ప్రాసెసింగ్ ఫీజు లేదా వ్యక్తిగత వివరాలు అడుగుతారు. న్యూ ఇయర్ పార్టీలకు సంబంధించిన పాస్‌లు, కచేరీలు, పబ్‌లు, రిసార్ట్స్ పేరుతో నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా పేజీల ద్వారా నకిలీ టికెట్లు అమ్ముతున్నారు.తక్కువ ధరలతో ఆకర్షణీయమైన హాలిడే ప్యాకేజీలు, యాత్రలు, క్రూయిజ్ టూర్లు, విదేశీ ప్రయాణ ఆఫర్లు ప్రకటించి అడ్వాన్స్ తీసుకుని మాయమవుతున్నారు. పర్యాటక ప్రాంతాల్లో న్యూ ఇయర్ బుకింగ్స్ పేరుతో నకిలీ హోటల్ వెబ్సైట్లు సృష్టించి డబ్బులు వసూలు చేసి ఆపై అందుబాటులో లేకుండా పోతున్నారు. వారి ట్రాప్ లో పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.
లింకులు పంపితే...
క్రిస్మస్ ఛారిటీ, అనాథాశ్రమాలు, చర్చిలు, సహాయ కార్యక్రమాల పేరుతో నకిలీ ఖాతాలు, యూపీఐ ఐడీల ద్వారా విరాళాలు కోరుతున్నారు. అలాగే క్రిస్మస్ మాస్ ఎంట్రీ పాస్‌లు, కార్ పార్కింగ్ అనుమతులు, ప్రత్యేక ఈవెంట్ల రిజిస్ట్రేషన్లు, సీజనల్ ఉద్యోగాల పేరుతో లింకులు పంపి రిజిస్ట్రేషన్ ఫీజులు, డాక్యుమెంట్ వివరాలు అడుగుతున్నారు. రిఫండ్లు, న్యూ ఇయర్ బోనస్, రివార్డ్ పాయింట్లు పేరుతో ఓటీపీలు పంచుకోవాలని కోరుతూ సందేశాలు పంపుతున్నారు. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలి. పండగతో పాటు న్యూ ఇయర్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలనుకున్న వారిని ట్రాప్ చేసేందుకు వివిధ రూపాల్లో సైబర్ నేరగాళ్లు చొరబడే అవకాశముందని అంటున్నారు.
జాగ్రత్తలు ఇలా...
అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దు. తెలియని యాప్‌లు లేదా ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేయవద్దు. ఓటీపీ, పిన్, సీవీవీ, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకూడదు. ఆఫర్లు, పార్టీ పాస్‌లు, బుకింగ్స్ అధికారిక వెబ్సైట్లు లేదా నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే నిర్ధారించుకోవాలి. తెలియని క్యూ ఆర్ కోడ్లు స్కాన్ చేయవద్దు. తెలియని యూపీఐ అభ్యర్థనలను ఆమోదించవద్దు. అవసరమని తొందరపెట్టే కాల్స్, సందేశాలపై అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన ఖాతాలన్నింటికీ టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉపయోగించాలి. మొబైల్, యాప్‌లను తరచూ అప్డేట్ చేయాలని, కుటుంబ సభ్యులతో ముఖ్యంగా వృద్ధులు, యువతతో—సైబర్ భద్రతపై చర్చించాలని సూచించారు. మోసం జరిగితే వెంటనే **www.cybercrime.gov.in**లో ఫిర్యాదు చేయాలని లేదా 1930 సైబర్‌క్రైం హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. స్క్రీన్షాట్లు, లావాదేవీ వివరాలు, ఫోన్ నంబర్లు వంటి ఆధారాలు భద్రపరచుకోవాలి.
Next Story

