రూ.86.73 లక్షల ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్ లో మోసపోయిన డాక్టర్
నకిలీ ‘టెన్కోర్’ యాప్‌తో మోసం చేసిన నిందితులు IPO లాభాలు పేరుతో పెట్టుబడులు పెట్టించి మోసం

హైదరాబాద్ : నగరానికి చెందిన వైద్యుడు ఆన్లైన్ ట్రేడింగ్ మోసానికి బలయ్యాడు. ‘టెన్కోర్’ నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ద్వారా రూ.86.7 లక్షలు మోసపోయినట్లు ఆయన ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హెచ్ఎమ్టీ స్వర్ణపురి కాలనీకి చెందిన డాక్టర్ రాము పుజారి (54), వాట్సాప్ ద్వారా వచ్చిన ప్రకటన ఆధారంగా 2025 సెప్టెంబర్ 29న ‘టెన్కోర్’ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలో చేరారు. ఈ ప్లాట్‌ఫాంను భారతీయుడు ప్రవీణ్ పటేల్, విదేశీయుడు క్రిస్ హార్పర్ కలిసి నడిపినట్లు అనుమానిస్తున్నారు. వీరు ‘క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB)’ అకౌంట్ పేరుతో పెట్టుబడులపై భారీ లాభాలు వస్తాయని చెప్పి ఆకర్షించారు.
‘లాభాలు చూపించి నమ్మబలికారు’
డాక్టర్ పుజారి ఫిర్యాదులో తెలిపిన ప్రకారం, ప్రతి రోజు ఉదయం 9.00 నుంచి 9.15 వరకు దేశీయ ట్రేడింగ్, సాయంత్రం 6.00 నుంచి 6.30 వరకు అంతర్జాతీయ ట్రేడింగ్ పేరుతో యాప్‌లో ట్రేడింగ్ సెషన్లు నిర్వహించేవారని. మొదట కొద్దిపాటి పెట్టుబడిపై లాభాలు చూపించడంతో నమ్మి దశలవారీగా పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టారని తెలిపారు. రూ.20 లక్షలు, రూ.50 లక్షలు, రూ.1.5 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న గ్రూపుల పేరుతో మరింత పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు.
తర్వాత క్రిస్ హార్పర్ ‘IPO మిడ్వెస్ట్’ పేరుతో మరో పథకం చూపించి అదనంగా డిపాజిట్ చేయాలని ప్రోత్సహించాడని చెప్పారు. లాభాలను విత్‌డ్రా చేసుకునే సమయంలో ‘పెండింగ్ పేమెంట్స్’ క్లియర్ చేయాలని, ఆ తర్వాత 10 శాతం ట్యాక్స్ చెల్లించాలంటూ కొత్త కారణాలు చెప్పారని తెలిపారు.
‘బెంగళూరు చిరునామా కూడా నకిలీదే’
తన డబ్బు రాకపోవడంతో కంపెనీ చిరునామా ‘ప్రెస్టీజ్ ఖోడే బిల్డింగ్, 5 రాజ్‌భవన్ రోడ్, బెంగళూరు’ అని చెబుతుండడంతో ఆయన అక్కడికి వెళ్ళి పరిశీలించగా అలాంటి కార్యాలయం లేనట్లు తేలిందని చెప్పారు. అప్పుడే తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ తన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి నిందితులు ఇచ్చిన పలు ఖాతాలకు, యూపీఐ ఐడీలకు డబ్బు బదిలీ చేశారు. మొత్తం నష్టం రూ.86,73,000. నిందితులు నకిలీ యాప్ సృష్టించి ట్రేడింగ్ జరుగుతున్నట్లు చూపించి పెట్టుబడిదారులను వలలో వేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఖాతా వివరాలు, డిజిటల్ ఆధారాలపై దర్యాప్తు చేస్తున్నారు.

