Fri Dec 05 2025 22:40:59 GMT+0000 (Coordinated Universal Time)
Cyber Crime : రెచ్చిపోతున్న సైబర్ కేటుగాళ్లు.. తెలంగాణలో ఈ ఏడాది 600 కోట్ల హాంఫట్
సైబర్ క్రైమ్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది దాదాపు 606 కోట్ల రూపాయలను దోచుకున్నారు

సైబర్ క్రైమ్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది దాదాపు 606 కోట్ల రూపాయలను దోచుకున్నారు. దాదాపు 14.739 మంది వద్ద నుంచి కేటుగాళ్లు కొట్టేశారు. అనేక రకాలుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి. బ్యాంకులో ఉన్న లావాదేవీలను పరిశీలించి ఫోన్ చేసి దోచుకోవడంతో పాటు, డిజిటల్ అరెస్ట్ తో అమాయకులను నమ్మించి మోసం చేయడం వంటి నేరాలు ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఏడాది ఎనిమిది నెలల్లో పథ్నాలుగు వేల మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారంటే ఏ రేంజ్ లో వారు దోపిడీకి పాల్పడుతున్నారో అర్థమవుతుంది.
సోషల్ మీడియా వేదికగా...
సోషల్ మీడియాలో వాట్సప్, టెలిగ్రామ్, ట్విట్టర్ వంటి వాటిని ఉపయోగించుకుంటూ అమాయకులను దోచుకుంటున్నారు. ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు దిగుతున్నారు. ఇందుకోసం సైబర్ కేటుగాళ్లు సోషల్ మీడియాలో వివిధ చోట్ల గ్రూపులను క్రియేట్ చేసి మరీ కొల్లగొడుతున్నారు. గ్రూపుల్లో తొలుత చేర్చుకుంటారు. సభ్యులుగా చేర్చుకున్న తర్వాత వారితో చాటింగ్ మొదలెడతారు. ట్రేడింగ్ పేరుతో నకిలీ లింకులను ఆ గ్రూపులో పోస్టు చేస్తారు. ఇందులో పెట్టుబడితే తక్కువ సమయంలోనే ఎక్కువ సొమ్ము వచ్చిపడుతుందని ఆశ చూపుతారు. దీంతో ఎక్కువ మంది వీర వలలో పడుతున్నారు.
అకౌంట్ లో ఉన్న మొత్తాన్ని...
లింకు క్లిక్ చేసిన వెంటనే అందులోనూ ఎక్కువ సొమ్ములు వస్తాయని కనిపిస్తుంది. అందులో పెట్టుబడులు పెట్టించిన తర్వాత వారి అకౌంట్లలో అధిక మొత్తం తక్కువ సమయంలో పడినట్లు చూపుతారు. కొంత మొత్తం విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఇస్తారు. తర్వాత బాగా నమ్మకం కలిగించిన తర్వాత అధిక మొత్తంలో పెట్టుబుడులు పెట్టేలా ఆకట్టుకుంటారు. దీంతో లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన వారికి టాస్క్ లు కూడా ఇస్తారు. బహుళ జాతి కంపెనీలకు చెందిన ఉత్ప్త్తులను ప్రమోట్ చేయడానికి ఫోన్ లో స్క్రీన్ షీట్ కు రెండు వందల రూపాయలు ఇస్తామంటూ నమ్మబలుకుతారు. ఇలాంటి వారికోసం ప్రత్యేకంగా పాస్ వర్డ్ లు, ఐడీలు క్రియేట్ చేసి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ నేరాలపై ఎన్ని ప్రకటనలు చేస్తున్నా వారి వలలో పడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. తెలియని వారి నుంచి ఫోన్ వచ్చినా, వారు చెప్పిన మాటలను విశ్వసించవద్దంటూ సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు.
Next Story

