Sun Nov 03 2024 04:35:11 GMT+0000 (Coordinated Universal Time)
పట్టపగలు యువకుడి దారుణ హత్య
స్థానిక పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బీర్ పూర్ కు చెందిన జువ్వికింది వంశీ(23) తుంగూర్ లోని డ్రైవింగ్ స్కూల్
ప్రేమికులంతా.. తమ ప్రేమను పెళ్లి పీటలవరకూ తీసుకెళ్లలేరు. అందుకు రకరకాల కారణాలుంటాయి. కులం, ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఇలా అనేక కారణాలను సాకుగా చూపి.. పెద్దలు ప్రేమికులను విడదీసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ కాలంలో ప్రేమికులు దంపతులు కాలేకపోయినా.. ప్రేమించినవారిని మరచిపోలేక.. పెళ్లిళ్లయ్యాక వారితో సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అలా.. ప్రేమించిన యువతికి పెళ్లైనా.. ఇంకా ఆమెతో మాట్లాడుతున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలే యువకుడిపై దాడిచేసి హతమార్చారు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలంలో ఆదివారం జరిగింది.
స్థానిక పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బీర్ పూర్ కు చెందిన జువ్వికింది వంశీ(23) తుంగూర్ లోని డ్రైవింగ్ స్కూల్ లో పనిచేస్తున్నాడు. అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, వంశీ ప్రేమించుకున్నారు. విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో రెండేళ్ల క్రితం ఆమెకు మరో వ్యక్తితో పెళ్లిచేశారు. పెళ్లైనా యువతి - వంశీ తరచూ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారని, ఎవరికీ తెలియకుండా కలుసుకుంటున్నారని కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. దాంతో వంశీని యువతికి దూరంగా ఉండాలంటూ.. పలుమార్లు హెచ్చరించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో అడ్డుతొలగించాలని భావించారు.
ఆదివారం కొల్వాయి నుంచి తుంగూర్ కు బైక్ పై వస్తున్న వంశీని ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని.. గొడలి, ఇతర ఆయుధాలతో తలపై దాడి చేశారు. తీవ్రరక్తస్రావంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వంశీ బంధువులు, గ్రామస్తులు .. యువతి కుటుంబ సభ్యులే చంపేశారంటూ ఆందోళనకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. వంశీ తల్లి, బాబాయి లారీ కింద పడుకుని చనిపోతామని బెదిరించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రకాశ్ హామీ ఇవ్వడంతో.. ధర్నా విరమించారు. వంశీ ప్రేమించిన యువతి తండ్రి రమేష్, సోదరుడు విష్ణు కలిసి ఈ హత్య చేశారని వంశీ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మిస్సైన వంశీ ఫోన్ కోసం వెతుకుతున్నారు.
Next Story