Tue Sep 10 2024 10:56:07 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad Chaitanyapuri: తల్లి ఆత్మహత్య చేసుకుందని.. కొడుకు ఊహించని చర్య
హైదరాబాద్ నగరంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది
హైదరాబాద్ నగరంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి చైతన్యపురిలోని తమ ఇంట్లో ఓ మహిళ, ఆమె కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జి.శివ (50) అతడి భార్య జి.పద్మ (44) తమ కుమారులు జి వంశీ (18), అరుణ్‌లతో కలిసి కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు నుండి నగరానికి వచ్చి చైతన్యపురి కొత్తపేటలోని ఎస్ఎల్ఆర్ కాలనీలో ఉంటున్నారు.
కొన్ని వారాల క్రితం.. జి.శివ అనారోగ్య సమస్యలతో మరణించారు. అప్పటి నుండి పద్మ తన ఇద్దరు కుమారులతో కలిసి ఇంట్లోనే ఉంటున్నారు. బుధవారం కుమారులు లేని సమయంలో పద్మ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి ఇంటికి వచ్చిన వంశీ, అరుణ్ తల్లి మృతిని చూసి షాక్ అయ్యారు. ఉరి నుండి తీసి ఆమెను నేలపై పడుకోబెట్టారు. వారి బంధువులకు సమాచారం ఇవ్వాలని వంశీ అరుణ్‌ని కోరాడు. అరుణ్ బయటకు వెళ్ళినప్పుడు.. వంశీ కూడా అదే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన అరుణ్ తన సోదరుడు కూడా చనిపోయి ఉండడం చూసి షాక్ అయ్యాడు. విషయం తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు అక్కడికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఇంటి పెద్ద అయిన శివ చనిపోవడంతో ఇంటి నిర్వహణ, పిల్లల చదువుల కోసం పద్మ తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు బంధువులు పోలీసులకు తెలిపారు.
Next Story