Sun Dec 08 2024 16:03:36 GMT+0000 (Coordinated Universal Time)
మదనపల్లెలో దారుణం.. మాజీ భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ
కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా దూరంగా ఉంటున్న బాబ్జీ-యాస్మిన్ లకు 10 రోజుల క్రితం విడాకులు..
పెళ్లై ముగ్గురు పిల్లలున్న దంపతులు 10 రోజుల క్రితం విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఇద్దరి మధ్య జరిగిన ఓ గొడవలో మాజీ భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిందో మహిళ. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో గురువారం (మే4) రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన బావాజీ అలియాస్ బాబ్జీ(33)కు మదనపల్లెకు చెందిన యాస్మిన్ తో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాబ్జీ స్థానిక చికెన్ సెంటర్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా దూరంగా ఉంటున్న బాబ్జీ-యాస్మిన్ లకు 10 రోజుల క్రితం విడాకులు మంజూరయ్యాయి. యాస్మిన్ ముగ్గురు పిల్లలతో కలసి పుట్టింట్లో ఉంటోంది. మదనపల్లెలోని డ్రైవర్స్ కాలనీలో ఉంటోన్న యాస్మిన్ వద్దకు వెళ్లాడు బాబ్జీ. తన పిల్లల్ని చూసేందుకు వచ్చానని చెప్పగా యాస్మిన్, ఆమె కుటుంబ సభ్యులు బాబ్జీని అడ్డుకున్నారు. పిల్లల్ని కూడా చూడనివ్వరా అని బాబ్జీ గొడవ చేయడంతో.. యాస్మిన్, కుటుంబీకులు అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
మంటలంటుకోవడంతో.. కాపాడండి అంటూ బాబ్జీ పెద్ద పెట్టున కేకలు వేయగా స్థానికులు వచ్చి మంటల్ని ఆర్పివేశారు. వెంటనే 108లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో బాబ్జీకి తీవ్రగాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story