Sun Jul 20 2025 07:18:47 GMT+0000 (Coordinated Universal Time)
Bihar Murder Case : మేనమామ కోసం.. భర్తను హత్య చేసి.. కటకటాల్లోకి?
బీహార్ లో మేనమామను పెళ్లి చేసుకోవాలని కట్టుకున్న భర్తను భార్య ప్లాన్ చేసి హతమార్చింది

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు తర్వాత దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇలాంటి తరహా హత్యలే జరుగుతున్నాయి. తెలంగాణలోని గద్వాల్ లోనూ భార్య తన భర్తను ప్రియుడి కోసం చంపించి నిందితులందరూ కటకటాల వెనక్కువెళ్లారు. అయితే తాజాగా ఇదే తరహా మర్డర్ బీహార్ లో జరిగింది. మేనమామను పెళ్లి చేసుకోవాలని కట్టుకున్న భర్తను హతమార్చేందుకు భార్య ప్లాన్ చేసింది. బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బార్వాన్ గ్రామానికి చెందిన ప్రియాంశుతో గుంజాదేవికి రెండున్నర నెల క్రితం వివాహమయింది.
పెద్దల ఒత్తిడితో...
అయితే ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా పెద్దల ఒత్తిడితో పెళ్లికి అంగీకరించింది. అయితే ఆమె తన మేనమామ అయిన యాభై ఐదేళ్ల జీవన్ సింగ్ ను వివాహం చేసుకోవాలనుకున్నది. వీరిద్దరికి గత కొన్నేళ్లుగా ఉన్న అక్రమ సంబంధంతో ఆయనతోనే తన జీవితం కొనసాగించాలని గుంజా దేవి నిర్ణయించుకుంది. కానీ వాళ్లిద్దరి వివాహానికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. ఇందుకోసం తాళి కట్టిన భర్తను లేపెయ్యాలని ప్లాన్ చేసింది. బలవంతపు పెళ్లి ఇష్టం లేని గుంజాదేవి తన మేనమామ తో కలసి మర్డర్ స్కెచ్ వేసింది.
కాల్చి చంపడంతో...
గత నెల 25వ తేదీన ప్రియాంశు తన సోదరి ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రైలులో నగర స్టేషన్ కు చేరుకున్నాడు. తనను రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకోవాలని, ఎవరినైనా పంపాలంటూ గుంజాదేవికి అమాయకంగా ప్రియాంశు ఫోన్ చేశాడు. దీంతో గుంజాదేవి పథకం ప్రకారం రైల్వేస్టేషన్ నుంచి తీసుకు వస్తుండగా ప్రియాంశును ఇద్దరు కలసి కాల్చి చంపారు. హత్య చేసిన తర్వాత గుంజాదేవి గ్రామం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. కాల్ డేటా ప్రకారం మేనమామ జీవన్ సింగ్ కోసం గాలిస్తున్నారు. ఈ హత్యకు పాల్పడిన కిరాయిహంతకులతో పాటు గుంజాదేవిని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో భార్యలే భర్తలను హతమార్చిన ఘటనలు వరసగా జరుగుతుండటం కలకలం రేపుతున్నాయి.
Next Story