Sat Sep 07 2024 11:23:41 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో మత ఘర్షణలు.. 14 మంది అరెస్ట్
శనివారం నాడు జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీపై దుండగులు రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. పోలీసులు ఘటనా స్థలానికి..
న్యూఢిల్లీ : ఢిల్లీలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. హింసాత్మక ఘటనలకు సంబంధించి 14 మంది అరెస్ట్ అయ్యారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. మరో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై విచారణను ప్రారంభించామని ఢిల్లీ పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ హింసాకాండకు సంబంధించి దాదాపు 100 సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
శనివారం నాడు జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీపై దుండగులు రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు వాహనాలకు నిప్పుపెట్టడంతో కొన్ని దగ్ధమయ్యాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా కూడా పరిస్థితి అదుపులో ఉందని, ఘటన జరిగిన ప్రాంతంలో అదనపు బలగాలు ఉన్నాయని చెప్పారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. పరిస్థితి అదుపులోకి తీసుకోవడంతో పాటు లా అండ్ ఆర్డర్ ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ హింసాత్మక ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 8 మంది పోలీసులు, ఒక పౌరుడు ఉన్నాడని అధికారులు తెలిపారు. ఈ అల్లర్లకు కారకులైన మరికొంత మందిని గుర్తిస్తామని అధికారులు తెలిపారు.
వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించి 14 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. శనివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రాళ్లు రువ్వడంతోపాటు కొన్ని వాహనాలు కూడా దగ్ధమైనట్లు వారు తెలిపారు. హింసాకాండలో ఒక పోలీసు సబ్-ఇన్స్పెక్టర్కు బుల్లెట్ గాయమైనట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సెక్షన్లు 307 (హత్య ప్రయత్నం), 120 బి (నేరపూరిత కుట్ర), 147 (అల్లర్లు), ఇండియన్ పీనల్ కోడ్ మరియు ఆయుధాల చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్‌వెస్ట్) ఉషా రంగనాని తెలిపారు. ఎఫ్ఐఆర్కు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్టు చేశామని ఆమె తెలిపారు. అనంతరం మరో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు.
Next Story