Sat Dec 06 2025 09:17:00 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డుప్రమాదంలో వైసీపీ జడ్పీటీసీ మృతి
ఈ ప్రమాదంలో జడ్పీటీసీ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా.. అతనితో కలిసి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్నేహితులు..

రోడ్డుప్రమాదంలో జడ్పీటీసీ మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లా వెంకటగిరి మండలంలో చోటుచేసుకుంది. జిల్లాలోని కె.ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వెంకటగిరి వైసీపీ జడ్పీటీసీ కోలా వెంకటేశ్వర్లు (48) బుధవారం రాత్రి తిరుపతి నుండి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాయుడుపేట - పూతలపట్టు జాతీయ రహదారిలో రేణిగుంట మండలం, మర్రిగుంట వద్ద ముందుగా వెళుతున్న ఇనుప లోడ్ లారీని వెంకటేశ్వర్లు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో జడ్పీటీసీ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా.. అతనితో కలిసి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్నేహితులు రమణయ్య, సుబ్బరాయుడు, మిలిటరీ శ్రీనులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గాజులమాన్యం పోలీసులు.. కేసు నమోదు చేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కోలా వెంకటేశ్వర్లు కారును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా.. వెంకటేశ్వర్లుకు భార్య, కుమార్తె (14) ఉన్నారు. వెంకటేశ్వర్లు మరణవార్తతో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ఆయన మృతి పట్ల స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.
Next Story

