Fri Dec 05 2025 11:41:41 GMT+0000 (Coordinated Universal Time)
Terrorists in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రవాదుల మూలాలతో పోలీసుల హై అలెర్ట్.. ఇంకా ఎక్కడెక్కడున్నారో?
నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో మాత్రమే ఎక్కువ ఉగ్రకదలికలుండేవి. కానీ ఇప్పుడు అవి ఆంధ్రప్రదేశ్ కు కూడా పాకాయి

నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో మాత్రమే ఎక్కువ ఉగ్రకదలికలుండేవి. కానీ ఇప్పుడు అవి ఆంధ్రప్రదేశ్ కు కూడా పాకాయి. దీంతో ఇప్పటి వరకూ ఉగ్రవాదుల కదలికలపై పెద్దగా దృష్టిపెట్టని ఏపీ పోలీసులు ఇక ప్రతి నగరంలో ఉగ్ర కదలికలపై ఫోకస్ చేయాల్సి ఉంది. విజయనగరంలో ఉగ్రజాడలు ఎవరూ ఊహిచంలేదు. కానీ ఉగ్రవాద మూలాలున్న సమీర్, సిరాజ్ లను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెద్ద కుట్ర తప్పినట్లయింది.. దేశ వ్యాప్తంగా వీరి నెట్ వర్క్ ఉన్నట్లు విచారణలో బయటపడటంతో దేశమంతా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. మారుమూల జిల్లాలో ఈ ఉగ్రకదలిలకు ఊతం కల్పించిన విధానం విని కూడా వారు షాక్ కు గురయ్యారు. హైదరాబాద్, వరంగల్, విజయనగరం, బెంగళూరు నగరాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడాలని కుట్ర చేసినట్లు విచారణలో వెల్లడయింది.
రాయచోటిలోనూ...
తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని రాయచోటిలో కూడా ఉగ్రకదలికలు అందరినీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. కరడు గట్టిన ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ ఆలీ అలియాస్ మన్సూర్ ఢిల్లీకి పార్సిల్ బాంబు పంపేందుకు సిద్ధం చేసినట్లు పోలీసుల సోదాల్లో వెల్లడయింది. రాయచోటిలోని ఇద్దరి ఇళ్లలో పోలీసులు సోదాలు చేసినప్పడు కీలక విషయాలు బయటపడ్డాయి. సిద్ధిఖి ఇంట్లో పార్శిల్ బాంబులు కనుగొన్నారు. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ చిరునామాతో పార్శిల్ చేసి సిద్ధంగా ఉన్నట్లు తెలుసుకున్నపోలీసులు ఢిల్లీలో పేలుళ్లకు ప్లాన్ చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేశారు. ఇప్పటికే తమిళనాడు ఇంటలిజెన్స్ పోలీసులతో పాటు రాయచోటి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడు ప్రధాన నగరాల మ్యాప్ లతో పాటు రైల్వే రూట్ మ్యాప్ దొరకడంతో దేశంలో ఎక్కడెక్కడ పేలుళ్లకు ఈ ఇద్దరు కరడుగట్టిన ఉగ్రవాదులు ప్లాన్ చేశారన్న విషయం వెల్లడయింది.
తాజాగా ధర్మవరం పట్టణంలో...
ఇక తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తి దొరకడంపై కూడా ఒకింత దడపుట్టించేలా ఉంది. నూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేశారు. ఒక హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్న నూర్ ధర్మవరం పట్టణంలోని కోట కాలనీలో మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకునట్లు తెలిసింది. పాక్ ఉగ్రవాదులతో వాట్సాప్ కాల్స్ నూర్ మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థతో పాటు పలు ఉగ్రవాద సంస్థలతో నూర్ కు లింకులున్నాయని పోలీసుల విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. అతని ఇంటి నుంచి సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై పై ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో నలుమూలల ఉగ్రకదలికలు మాత్రం పోలీసులను మాత్రమే కాదు.. ప్రజలను షేక్ చేస్తున్నాయనే చెప్పాలి.
Next Story

