Fri Dec 05 2025 11:41:48 GMT+0000 (Coordinated Universal Time)
దుర్గామాత నిమజ్జనంలో విషాదం.. 19 మంది మృతి
durga-immersion-accidents-madhya-pradesh-khandwa-ujjain

మధ్యప్రదేశ్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం వేడుకల సందర్భంగా అపశృతి జరిగింది. వేర్వేరు ఘటనలో మొత్తం ఇప్పటి వరకూ పందొమ్మిది మంది మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జిల్లా, జంలి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పండనా పోలీస్ స్టేషన్ పరిధిలోని జంలి గ్రామంలో ఆదివారం రాత్రి భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ చెరువులో పడిపోయింది. ఆ వాహనంలో 20 నుంచి 25 మంది వరకూ ఉన్నారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలు వెలికితీశారు. అందులో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు.
ట్రాక్టర్ పై వెళుతుండగా....
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అర్డ్లా–జంలి గ్రామాల ప్రజలు విగ్రహ నిమజ్జనానికి వెళ్తుండగా ట్రాక్టర్ ట్రాలీపై బరువు ఉండటంతో వాహనం చిన్న వంతెనపై నియంత్రణ కోల్పోయి చెరువులో పడిపోయింది. మృతదేహాలను పండనా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి పోలీసులు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో ట్రాలీని బయటకు తీశారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు గాలింపు కొనసాగుతోంది.ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి తగిన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఉజ్జయిని జిల్లాలో...
ఇక ఉజ్జయిని జిల్లా బద్నగర్ సమీపంలోని నర్సింఘ గ్రామంలో మరో ట్రాక్టర్–ట్రాలీ నిమజ్జనానికి వెళ్తూ చంబల్ నదిలో పడిపోయింది. వాహనంలో ఎనిమిది మంది ఉన్నారు. అందులో ఐదుగురిని రక్షించారు. ముగ్గురు ఇప్పటికీ గల్లంతయ్యారు. వారిని వెతికే పనిలో స్థానిక పోలీసులు, రక్షక బృందాలు నిమగ్నమయ్యాయి. ఈ రెండు ఘటనలు ధార్మిక ఊరేగింపుల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు రేపాయి. ఇకపై నిమజ్జన సందర్భంగా ఆ యా ప్రాంతాల్లో వెళ్లే వాహనాల విషయంలో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Next Story

