Sat Dec 07 2024 01:37:10 GMT+0000 (Coordinated Universal Time)
రెండు రైళ్లు.. మూడు ప్రాణాలు.. పెద్దపల్లిలో విషాదం
ప్రమాదం జరిగిన కొన్ని గంటల వరకూ రైల్వే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకోకపోవడం గమనార్హం.
వారంతా రైల్వే కూలీ పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేశాక.. తిరిగి మళ్లీ విధుల్లోకి వెళ్లారు. అంతలోనే 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు..ముగ్గురిని బలితీసుకుంది. ఈ విషాద ఘటన పెద్దపల్లి మండలం కొత్తపల్లి స్టేషన్ సమీపంలో జరిగింది. ఈ ఘోర రైలు ప్రమాదం స్థానికంగా తీవ్రవిషాదాన్ని నింపింది. పెద్దపల్లి నుంచి కాజీపేట వైపు డౌన్ లైన్లో గూడ్స్ రైలు వెళ్తుండగా.. మధ్యలైన్లో కూలీలు పనిచేస్తున్నారు.
అదే సమయంలో మధ్యలైన్లో మరో రైలు వచ్చింది. పక్కనే వెళ్తున్న గూడ్స్ రైలు శబ్దానికి.. మధ్యలైన్లో వస్తున్న రైలు సౌండ్ వినిపించలేదు వారికి. అలాగే పనుల్లో నిమగ్నమై ఉండగా.. వేగంగా దూసుకొచ్చిన ఎక్స్ ప్రెస్ రైలు ముగ్గురు కూలీలను ఢీ కొట్టింది. దాంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. వారి శరీరాలు ఛిద్రమయ్యాయి. ఎదురుగా వస్తున్న రైలును గుర్తించిన మరో కూలి శ్రీనివాస్.. తాను పక్కకి దూకుతూ.. మిగతా వారిని అప్రమత్తం చేశాడు. కానీ.. వారు అప్రమత్తమయ్యేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎక్స్ ప్రెస్ రైలు రాక సమాచారం లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందా ? లేక రైలు వేగాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాగా.. ప్రమాదం జరిగిన కొన్ని గంటల వరకూ రైల్వే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకోకపోవడం గమనార్హం. స్థానిక పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి.. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన శ్రీనివాస్ తో మాట్లాడి, ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాలను గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. మృతులు కాంపల్లి వేణు కుమార్, పెగడ శ్రీనివాస్, దుర్గయ్య లుగా గుర్తించారు. మృతులందరి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story