Mon Dec 15 2025 07:26:23 GMT+0000 (Coordinated Universal Time)
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణ హత్య
బాధితుడు వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నాగరాజుగా గుర్తించారు. బెంగళూరులోని..

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణహత్యకు గురయ్యాడు. కారులో వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఆపిన దుండగులు అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బాధితుడు కారు నుంచి బయటకు వచ్చేలోపే నిప్పంటుకోవడంతో.. కారులోనే సజీవదహనమయ్యాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని నాయుడుపేట - పూతలపట్టు రోడ్డులో గుంగుడుపల్లె వద్ద జరిగింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతదేహం గుర్తుపట్టలేనంతగా దహనమవ్వడంతో.. ఆ కారు నంబరు ఆధారంగా వ్యక్తి వివరాలను సేకరించారు. బాధితుడు వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నాగరాజుగా గుర్తించారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఆయన పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి బెంగళూరు నుంచి స్వగ్రామమైన బ్రాహ్మణపల్లికి వెళ్తుండగా నాగరాజుపై దుండగులు దాడి చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. కాగా.. నాగరాజుపై ఎవరు దాడి చేశారు ? ఎందుకు చేశారు ? వ్యక్తిగత కక్షలా? లేక వృత్తిలో గొడవలా ? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

