Fri Dec 05 2025 13:01:12 GMT+0000 (Coordinated Universal Time)
నల్గొండ జిల్లాలో రథాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్
రామాలయంలో ఇటీవల రథోత్సవం నిర్వహించారు. ఇనుప రథం కావడంతో వర్షానికి తుప్పు పడుతుందనే భావనతో..

నాంపల్లి : నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాంపల్లి మండలం కేతపల్లిలోని రామాలయంలో విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి చెందారు. రథాన్ని తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తగిలిన వెంటనే వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రామాలయంలో ఇటీవల రథోత్సవం నిర్వహించారు. ఇనుప రథం కావడంతో వర్షానికి తుప్పు పడుతుందనే భావనతో శనివారం ఆ రథాన్ని రథశాలకు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న 11కేవీ విద్యుత్తు తీగలకు రథం తాకింది. దీంతో విద్యుదాఘాతంతో కేతపల్లికి చెందిన రాజబోయిన యాదయ్య(45), పొగాకు మోహన్(36), గుర్రంపూడ్ మండలం మక్కపల్లికి చెందిన దాసరి ఆంజనేయులు(26) అక్కడికక్కడే మృతి చెందారు. కేతపల్లికి చెందిన మరోవ్యక్తి రాజబోయిన వెంకటయ్యకు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఎస్సై రజనీకర్ కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

