Fri Dec 05 2025 18:23:42 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం : ఈతకువెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి
వనపర్తి పట్టణంలోని బండార్ నగర్ కు చెందిన ఎండి మున్నా (16), ఎండి అజ్మత్ (16), ఏర్పుల భరత్ (17) 10వ తరగతి ..

వనపర్తి : తెలంగాణలోని వనపర్తి జిల్లా కేంద్రంలో విషాద ఘటన జరిగింది. ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు నీటిలో మునిగి మృతి చెందడంతో.. ఆ కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. వనపర్తి పట్టణంలోని బండార్ నగర్ కు చెందిన ఎండి మున్నా (16), ఎండి అజ్మత్ (16), ఏర్పుల భరత్ (17) 10వ తరగతి చదువుతున్నారు. మంగళవారం సాయంత్రం ముగ్గురూ కలిసి సరదాగా వనపర్తి శివారులోని చెరువు వద్దకు వెళ్లారు. అనంతరం ఈత కొట్టేందుకు చెరువులోకి దిగగా.. అందులో లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
గజఈతగాళ్లను చెరువులో గాలించగా.. బుధవారం ఉదయానికి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు యువకుల మరణంతో.. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. వనపర్తి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

