పసుపు రంగు చెప్పులు పట్టించేశాయ్!!
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో నాదర్గుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో వరుసగా నేరాలు చేసింది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో నాదర్గుల్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో వరుసగా నేరాలు చేసింది. సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాలుగు రోజుల్లో నిందితులను పట్టుకున్నారు. ఈ ముఠాలోని ఓ దొంగ ధరించిన పసుపు రంగు చెప్పులే కీలక ఆధారంగా పనిచేశాయి. భీమవరానికి చెందిన జువ్వల తరుణ్ కుమార్ రాజు ఈ గ్యాంగ్‌కు లీడర్‌గా ఉన్నాడు. ఇతడిపై ఏపీలోని వివిధ పోలీసు స్టేషన్స్ లో 41 కేసులు ఉన్నాయి. నవంబర్ 5న కేవలం నాలుగున్నర గంటల్లో పది చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనాస్థలాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్ లో నిందితుల ముఖాలు, వాహనాల నెంబర్లు స్పష్టంగా నమోదు కాలేదు. ఓ నేరగాడు ధరించిన పసుపు రంగు చెప్పులు మాత్రం రాత్రి వేళ లైటింగ్‌కు విభిన్నంగా కనిపించాయి. దీంతో పాటు ప్రతి ప్రాంతంలోనూ వీరి వాహనం వెనుక మరో వాహనం నడిచింది. ఈ ఆధారంగా టాస్క్ ఫోర్స్ బృందం నాదర్గుల్ ప్రాంతానికి వెళ్లి కాపుకాసింది. అక్కడ ఓ మద్యం దుకాణం వద్దకు పసుపు చెప్పులు వేసుకున్న నేరగాడే రావడంతో గుర్తించి పట్టుకుంది. అతడిచ్చిన సమాచారంతో అద్దె ఇంట్లో ఉన్న మిగిలిన ముగ్గురు నేరగాళ్లుతో పాటు వీరికి సహకరిస్తున్న మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు.

