Tue Sep 10 2024 10:51:01 GMT+0000 (Coordinated Universal Time)
భక్తుడిపై పూజారి దాడి.. వైరల్ అవుతోన్న వీడియో
ఉప్పల్ బాలాజీహిల్స్ కి చెందిన వాల్మీకిరావు రాత్రి 7 గంటల సమయంలో దర్శనం చేసుకుందామని సికింద్రాబాద్ రైతి పైల్ బస్టాండ్ కు
సికింద్రాబాద్ : మానసిక ప్రశాంతత కోసం, దైవ దర్శనార్థం గుడికి వెళ్తుంటారు భక్తులు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులకు పూజారులు పూజలు చేసి భక్తులకు ప్రసాదం అందిస్తారు. కానీ.. ఆ పూజారే భక్తుడిపై దాడి చేస్తే ఏం చేయాలి ? వేదమంత్రాలు చదవాల్సిన పూజారి నోటి నుంచి బూతు పురాణం వినిపిస్తే.. అదీ దైవసన్నిధిలో.. అంతకంటే అపచారం ఉంటుందా ? ఇలాంటి ఘటన సికింద్రాబాద్ లో జరిగింది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ కు చెందిన పూజారులు ఓ భక్తుడిపై దాడి చేయడం కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ బాలాజీహిల్స్ కి చెందిన వాల్మీకిరావు రాత్రి 7 గంటల సమయంలో దర్శనం చేసుకుందామని సికింద్రాబాద్ రైతి పైల్ బస్టాండ్ కు ఆనుకుని ఉన్న గణేష్ టెంపుల్ కి వెళ్లి, దైవదర్శనం చేసుకున్నాడు. పక్కనే ఉన్న చిన్న చిన్న ఆలయాల్లోని దేవుళ్లను దర్శనం చేసుకుంటూ.. ఒక గుడి లోపలికి వెళ్లి దర్శనం చేసుకుంటుండగా.. మా అనుమతి లేకుండా గుడిలోపలికి ఎందుకెళ్లావ్ అంటూ బూతుపురాణం అందుకున్నారు పూజారి ప్రభాకర్ శర్మ. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభాకర్ శర్మ తిట్లతో ఆగకుండా భక్తుడిపై దాడి చేసి.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరించాడు. గత ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిలో భక్తుడిపై పూజారి దాడి చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు గత సోమవారం రోజు రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. సదరు పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story