Mon Sep 09 2024 11:17:39 GMT+0000 (Coordinated Universal Time)
ఫేక్ పియాజియో పార్ట్స్ అమ్ముతూ.. అడ్డంగా దొరికిపోయారు
ఇలాంటివి అన్నీ తెలుసుకుని.. మెకానిక్ లతో కుమ్మక్కయి
వాహనాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. సాధారణంగా షో రూమ్ లకు వెళితే చాలా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారనే భయం మనందరికీ ఉంటుంది. అలాగని లోకల్ మెకానిక్ దగ్గరకు వెళితే ఎలాంటి స్పేర్ పార్ట్స్ అమ్ముతారో.. అసలు అవి నిజమో కాదో కూడా మనం తెలుసుకోలేము. ఒరిజినల్ కంపెనీకి ఎలా అయితే ప్యాకింగ్ ఉంటుందో.. నకిలీవి కూడా దాదాపు అలానే ఉంటాయి. అందుకే సాధారణ ప్రజలు కనుక్కోవడం చాలా కష్టం.
ఇలాంటివి అన్నీ తెలుసుకుని.. మెకానిక్ లతో కుమ్మక్కయి పియాజియో కంపెనీ స్పేర్ పార్ట్స్ ను యథేచ్ఛగా అమ్మేస్తూ ఉన్నారు. అలాంటి వారిని తెలంగాణ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పియాజియో నకిలీ విడిభాగాలను అందిస్తున్న వ్యక్తులను నిర్మల్ పోలీసులు పట్టుకున్నారు. దాడులు చేసి నేరస్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటకటాల వెనక్కు పంపారు. కర్ణాటక పోలీసులు ఇచ్చిన క్లూ ఆధారంగా తెలంగాణ పోలీసులు భైంసాలోని నేషనల్ మోటార్స్ కంపెనీపై దాడులు చేశారు. నేషనల్ ఆటో స్పేర్స్, నేషనల్ మోటార్స్ షాపుల్లో భారీగా ఫేక్ పార్ట్స్ ను అమ్ముతున్నారని కనుగొన్నారు. ఒరిజినల్ కంపెనీకి చెందిన స్పేర్ పార్ట్స్ అంటూ చెప్పి.. ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
నిందితులను షేక్ ఫాజిల్, మహ్మద్ నజీమ్ లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63, ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. ఈ విడి భాగాలను ఎక్కడి నుండి తెస్తున్నారు.. ఎవరు తయారు చేయిస్తున్నారనే విషయాన్ని పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story