Sat Sep 14 2024 10:50:24 GMT+0000 (Coordinated Universal Time)
ఉపాధ్యాయురాలిపై దారుణం.. లిఫ్ట్ ఇస్తానని చెప్పి, బెదిరించి..
ఈనెల 17వ తేదీన ఎప్పటి లాగే స్కూల్ ముగిసిన అనంతరం ఇంటికెళ్లేందుకు రైల్వే స్టేషన్లో వేచి చూస్తున్న ఉపాధ్యాయురాలిని..
ఖమ్మం : లిఫ్ట్ ఇస్తానని చెప్పి నమ్మించి, ఆపై ఆమెను బెదిరించి ఉపాధ్యాయురాలిపై తోటి ఉపాధ్యాయుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. స్థానిక పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. ఖమ్మంలో నివసిస్తున్న బానోతు కిశోర్.. మహబూబాబాద్ జిల్లా గార్లమండలంలోని అంకన్నగూడెం పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య కూడా ఉపాధ్యాయురాలే కావడంతో.. ఇద్దరూ రోజూ కారులో పాఠశాలకు వెళ్లొస్తుంటారు. ఖమ్మంలోనే ఉంటున్న ఓ ఉపాధ్యాయురాలు డోర్నకల్ వరకు ప్యాసింజర్ రైలులో, అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపైన స్కూలుకు వెళ్లి వస్తుంటారు.
ఈనెల 17వ తేదీన ఎప్పటి లాగే స్కూల్ ముగిసిన అనంతరం ఇంటికెళ్లేందుకు రైల్వే స్టేషన్లో వేచి చూస్తున్న ఉపాధ్యాయురాలిని చూసిన కిశోర్.. కారులో డ్రాప్ చేస్తానని నమ్మించాడు. కొంతదూరం వెళ్లాక ఆమెను బెదిరించి మొబైల్ లాక్కున్నాడు. పాండురంగాపురంలోని ఓ ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె కొన్ని రోజులు ఎవరికీ చెప్పలేదు. మంగళవారం ధైర్యం చేసి భర్తకు చెప్పడంతో ఇద్దరూ కలిసి ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు కిశోర్ కోసం గాలిస్తున్నారు.
Next Story