Tue Mar 17 2026 09:22:55 GMT+0530 (India Standard Time)
తాడిపత్రిలో సీఐ ఆత్మహత్య కలకలం
స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. ఆత్మహత్య ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లోనే ఆయన ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. పని ఒత్తిడే తన తండ్రి ప్రాణం బలిగొందని ఆయన కుమార్తె భవ్య కన్నీరు పెట్టుకున్నారు. ఆనందరావు గతంలో తిరుపతి, కడపలో పనిచేశారని, క్కడా ఒత్తిడికి గురికాలేదని చెప్పారు. తాడిపత్రిలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, తన వల్ల కావడం లేదని చెప్పుకుని పలుమార్లు బాధపడ్డారని భవ్య తెలిపారు.
తాడిపత్రి సీఐ ఆనందరావు మృతికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతాపం తెలిపారు. సీఐ ఆనందరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనాస్థలిని అనంతపురం ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. సీఐ ఆనందరావు మృతికి కారణాలపై ఎస్పీ శ్రీనివాసరావు ఆరా తీశారు. సీఐ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. ఆత్మహత్య ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Next Story

