Fri Dec 05 2025 12:38:32 GMT+0000 (Coordinated Universal Time)
సిరాజ్ లో పశ్చాత్తాపం లేదట.. సౌదీలో శిక్షణ.. బాంబు పేలుళ్లకు కుట్ర జరిగింది అక్కడేనట
ఉగ్రవాదానికి అట్రాక్ట్ అయిన సిరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేసినా ఇసుమంతైనా ఏ మాత్రం పశ్చత్తాపం కనిపించడం లేదు

ఉగ్రవాదానికి అట్రాక్ట్ అయిన సిరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేసినా ఇసుమంతైనా ఏ మాత్రం పశ్చత్తాపం కనిపించడం లేదు. గత కొద్ది రోజులుగా ఎన్ఐఏ విచారణలోనూ సిరాజ్ పొంతన లేని సమాధానం చెబుతూ తనను వదిలేసి చూడండని ఏం జరుగుతుందో చెప్తానంటూ పోలీసులకే సవాల్ విసురుతున్నాడనితెలిసింది. దేశ వ్యాప్తంగా ఐదు నగరాల్లో బాంబు బ్లాస్ట్ లు జరపాలని సిరాజ్, సమీర్ లు ప్లాన్ వేసిన పోలీసులు భగ్నం చేసిన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు పది రోజుల నుంచి విజయనగరంలోనే ఉంటూ వారిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే సిరాజ్, సమీర్ లను అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ సమస్యకు పరిష్కారందొరకదని భావించిన ఎన్ఐఏ అధికారులు వారిని లోతుగా విచారిస్తున్నారు. ఇందులో
సంచలన విషయాలు చెప్పిన...
ఎన్ఐఏ విచారణలో సిరాజ్ సంచలన విషయాలు చెప్పినట్లు తెలిసింది. తన గ్రూపులోని సభ్యుల వివరాలు వెల్లడించిన సిరాజ్ వారి అడ్రస్ లను కూడా కొంత మేరకు ఎన్ఐఏ అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎన్ఐఏ అధికారులు ఆయా రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసి వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బాంబుపేలుళ్ల కేసులో సిరాజ్, సమీర్ లు అరెస్ట్ అయిన వెంటనే గ్రూపులోని మిగిలిన పది మంది సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఖచ్చితంగా తమ సమాచారాన్ని పోలీసులకు చెబుతారని భావించి వారు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలిసింది. అయినా సరే వారి బంధువులను అదుపులోకి తీసుకునేందుకు ఆయా రాష్ట్రాల పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రూపునకు సంబంధించి...
పరారీలో ఉన్న అహిం గ్రూప్‌కు చెందిన మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. వీరిలో కొందరిని మానవ బాంబులుగా తయారు చేశారని అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ముంబైలో సిరాజ్, సమీర్ పన్నెండు మందితో సమావేశమైయ్యారని, ముంబై సమావేశంపై కీలక సమాచారం సేకరిస్తున్న దర్యాప్తు అధికారులు వారి ఆచూకీ తెలిస్తే కానీ అసలు విషయం బయటకు రాదని చెబుతున్నారు. వారి వల్ల ఎక్కడైనా ప్రమాదం సంభవిస్తుందేమోనన్న జాగ్రత్తలు తీసుకుంటూ సమాచారాన్ని బయటకు రానివ్వడం లేదు. అయితే ఎన్ఐఏ అధికారులు సిరాజ్,సమీర్ ల నుంచి కీలక సమాచారం సేకరించి అందరినీ అరెస్ట్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు.
సౌదీలో శిక్షణ...
ఎన్ఐఏ అధికారుల విచారణలో మరో ముఖ్యమైన విషయాలను కూడా సిరాజ్ చెప్పినట్లు తెలిసింది. విజయనగరంలో నాలుగు చోట్ల, హైదరాబాద్ లో కొన్ని చోట్ల తొలుత బాంబులు పేల్చాలని నిర్ణయించారని తెలిపారు. పేలుళ్ల కోసం సౌదీలో శిక్షణ తీసకున్నట్లు కూడా సిరాజ్ ఎన్ఐఏ అధికారులకు తెలిపినట్లు తెలిసింది. శిక్షణ కోసం హైదరాబాద్ కు వచ్చి రెండు సార్లు సౌదీకి సిరాజ్ వెళ్లినట్లు అధికారుల విచారణలో స్పష్టమయింది. సౌదీలో ఉన్న హ్యాండ్లర్ నుంచి తనకు నగదు కూడా అందినట్లు సిరాజ్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. పేలుళ్ల కు ఏ ఏ ప్రాంతాల్లో జరపాలన్న నిర్ణయం కూడా తీసుకున్నామని, ఆ ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించినట్లు సిరాజ్ విచారణలో అంగీకరించినట్లు తెలిసింది.
Next Story

