Fri Dec 05 2025 12:39:38 GMT+0000 (Coordinated Universal Time)
విజయనగరాన్ని సిరాజ్ ఎందుకు ఎంచుకున్నాడంటే?
బాంబుపేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ విజయనగరాన్ని సురక్షితమైన ప్రదేశంగా ఎంచుకున్నాడు.

బాంబుపేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ విజయనగరాన్ని సురక్షితమైన ప్రదేశంగా ఎంచుకున్నాడు. విజయనగరంలో పెద్దయెత్తున పేలుళ్లకు పాల్పడవచ్చని సిరాజ్ ప్లాన్ చేశాడు. పేలుళ్లకు అవసరమైన వాటిని సామగ్రిని కొనుగోలు చేశాడు. ఉగ్రవాద భావాజాలానికి ఆకర్షితుడైన సిరాజ్ విజయనగరంలో నిత్యం రద్దీగా ఉండే విజ్జీ స్టేడియం వద్ద ఉన్న రాజానగర్ వద్ద పేలుడు జరపడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పోలీసులు ఈ విషయాన్ని ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు. ఐఈడీ తయారీ చేసి పేలుడు జరిపి పెద్ద సంఖ్యలో ప్రాణాలను బలికొనేందుకు వేసిన సిరాజ్ ప్లాన్ ను పోలీసులు ముందే పసిగట్టి అరెస్ట్ చేయడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.
పక్కా ప్లాన్ వేసి...
పేలుడు పదార్థాలతో పాటు వాటికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసిన సిరాజ్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సిరాజ్ నుంచి పేలుడు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. విజయనగరంతో పాటు హైదరాబాద్ లోనూ పేలుళ్లు జరపాలని సిరాజ్, సమీర్ లు కుట్ర పన్నారు. తమ వర్గాన్ని అణిచివేస్తున్న వారిపై కసి తీర్చుకునేందుకు ఈ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసినట్లు సిరాజ్, సమీర్ లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. తమ వర్గాన్ని కావాలని అణగదొక్కడం సహించలేని సిరాజ్ ఇందుకోసం ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అందుకు విజయనగరాన్ని ఎంచుకుని పక్కా ప్లాన్ వేసినా చివరకు పోలీసులకు దొరికపోయాడు.
ఇద్దరు మాట్లాడుకుని...
సిరాజ్ పేలుడు పదార్థాలను విజయనగరం బాణాసంచా తయారీ చేసే చోట కొనుగోలు చేశాడు. మిగిలిన పరికరాలను ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చి మరీ కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. గత నెల 20, 26, 30 వ తేదీల్లో ఉర్దు పాఠశాల చిరునామా పేరిట ఈ సామాగ్రి అందినట్లు పోలీసుల విచారణలో స్పష్టమయింది. సిరాజ్, సమీర్ లో వాట్సాప్ లోనే మాట్లాడుకోవడం, పేలుడుకు అవసరమైన సామాగ్రిని ఆన్ లైన్ లో కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగిపోయాయి. సమీర్, సిరాజ్ ను కస్టడీలోకి తీసుకుంటే వీరికి ఆర్ధిక సహకారం అందించిందెవరు? ఇంకా వీరి గ్యాంగ్ లో ఎవరెవరున్నారన్న దానిపై క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. కస్టడీ పిటీషన్ పై నేడు తీర్పు వెలువడే అవకాశముంది.
Next Story

