Fri Dec 05 2025 11:37:34 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడు జంట హత్య కేసులో అసలు మిస్టరీ ఇదేనా..? పది లక్షలు జమ చేసిందెవరు?
పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్య కేసుల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి

పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్య కేసుల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పల్నాడు జిల్లాలో వెల్దుర్ది మండలం బోదిలపీడులో జరిగిన జంట హత్య కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావును వాహనంతో ఢీకొట్టి చంపేసిన ఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ నేతలే ఉన్నారని తొలుత జిల్లా ఎస్పీ ప్రకటించారు. తర్వాత ఎఫ్ఐఆర్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తో పాటు ఆయన సోదరుడి పేరును కూడా చేర్చడం రాజకీయంగా కలకలం రేపింది. ఈ హత్యకు రాజకీయ ఆధిపత్య పోరు కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించినట్లు సమాచారం.
హత్య వెనక ఉన్నదెవరు?
ఈ కేసులో నిందితులుగా ఉన్న నాగరాజును వెంకటేశ్వర్లును గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే హత్యకు ఎవరు ప్రేరేపించారు? ఎవరికి వీరు సాయం చేశారు? హత్యకు గురైన వారి విషయంలో నిందితులకు ఉన్న గొడవలు ఏంటి? ఏ విషయం హత్యకు దారి తీసింది? అసలు నిందితుల వెనక ఉండి నడిపించెందెవరు? అన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు సూత్రధారుల కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ హత్యలను సీరియస్ గా తీసుకుని విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించడంతో వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.
కూపీ లాగుతున్న పోలీసులు...
తాజాగా అందుతున్న సమాచారం మేరకు నిందితుడి బ్యాంకు ఖాతాలో పది లక్షల రూపాయలు హత్య జరగడానికి ముందు జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఖాతాలో ఇంత పెద్ద మొత్తం ఎవరు జమ చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఏ అకౌంట్ నుంచి ఈ డబ్బులు విడతల వారీగా పడ్డాయన్న దానిపై కూడా పోలీసులు బ్యాంకు అధికారులను సంప్రదించి ఆరా తీస్తున్నారు. టీడీపీ నేతలను చంపడానికి టీడీపీ నాయకులకే ఉపయోగించడం వెనక ఉన్న కారణాలేంటి? అని అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిన్నెల్లి సోదరుల పాత్ర ఎంత ఉన్నదానిపై కూపీ లాగుతున్నారు. అదే జరిగితే పిన్నెల్లి సోదరులను కూడా అరెస్ట్ చేసి విచారణ చేసే అవకాశముందని తెలిసింది.
Next Story

