Fri Dec 05 2025 17:39:10 GMT+0000 (Coordinated Universal Time)
పోలీస్ స్టేషన్ పై దాడి.. హుబ్లీలో ఉద్రిక్త పరిస్థితి
పోలీసులు స్పందించకపోవడంతో.. అల్లరిమూకలు స్టేషన్ పై రాళ్లదాడికి పాల్పడ్డాయి. ఆ సమయంలో..

హుబ్లీ : కర్ణాటకలోని హుబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వ్యక్తి పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ కారణంగా అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓల్డ్ హుబ్లీ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అభ్యంతరకర రీతిలో వాట్సాప్ స్టేటస్ పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో.. అల్లరిమూకలు స్టేషన్ పై రాళ్లదాడికి పాల్పడ్డాయి. ఆ సమయంలో అక్కడే ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్స్ ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేదు.
దాడిలో ఇన్ స్పెక్టర్ సహా నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేసి ఉంచిన వాహనాలను సైతం దుండగులు ధ్వంసం చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ ఛార్జ్ చేశారు. హుబ్లీ పోలీస్ కమిషనర్ లభు రామ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హుబ్లీ నగర వ్యాప్తంగా 144 సెక్షన్ను విధించారు. హుబ్లీ ఓల్డ్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉన్న హనుమాన్ ఆలయంపైనా రాళ్లదాడి సంభవించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
Next Story

